Latest News
మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి లొంగుబాటు వార్తలపై స్పష్టత లేదు
05 Mar, 2026
40 Views
మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి లొంగుబాటు వార్తలపై స్పష్టత లేదు
హైదరాబాద్,మార్చి 05(అవనివిలేకరి)సిపిఐ మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ వ్యవహారాల ఇన్‌చార్జి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గణపతితో పాటు సుమారు 150 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఈ లొంగుబాటు విషయాన్ని కేంద్ర హోంశాఖ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. గణపతి లొంగుబాటుకు ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. దండకారణ్యం ప్రాంతం నుండి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని, ఏళ్ల తరబడి జైళ్లలో ఉన్న మావోయిస్టు రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని, వారిపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంశాఖను కోరినట్లు సమాచారం. గణపతి లొంగుబాటు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి బాడుగుల సుమతి, ఎస్‌ఐబి చీఫ్ విజయ్ కుమార్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ కగార్" ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. గణపతి ఇప్పటివరకు నేపాల్‌లో ఉండేవారని, ఇటీవల లొంగిపోయిన మరో మావోయిస్టు నాయకుడు దేవి ఈ విషయాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు.bగణపతితో పాటు ఆయన భార్య కూడా లొంగుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన కొందరు మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. దాదాపు 45 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితం గడిపిన గణపతి కథ ఇప్పుడు ముగిసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గణపతి స్వస్థలం తెలంగాణలోని బీర్పూర్ ప్రాంత ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గణపతి నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశం వెలుపల ఉన్న గణపతిని పోలీసులు తెలంగాణ లేదా ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై కేంద్ర హోంశాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.