సిద్ధిపేట జిల్లా నంగునూరు నర్మెట శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మే 1 వ తేదీన చక్ర స్నానం అనంతరం ముగుస్తాయి.వైద్య వెంకటరమణా చార్యులు, పెరంబుదూర్ శ్యామ సుందరాచార్యులు, వైద్య కృష్ణమాచార్యుల వైదిక నిర్వహణలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలో దేవుని నర్మెట గా ప్రసిద్ధి చెందిన నర్మెట శ్రీ చింతల సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని 16 వ శతాబ్దములో నిర్మించారు. పురాణ కథల ప్రకారం దాదాపు 400 సంవత్సరాల కిందట నర్మెటలో శ్రీరామ చంద్ర స్వామి సీత, లక్ష్మణుడు, హనుమంతునితో కలిసి వెలిశాడని తెలుస్తోంది. చరిత్ర ఆధారాల ప్రకారము ఇక్కడ చింత చెట్లు విరివిగా ఉండేవి. అందువల్ల చింతల సీతారామ చంద్ర స్వామి గా భక్తులు పిలుచుకునే వారు. పూర్వము దేవుని నర్మెట గ్రామము చుట్టూ దట్టమైన చెట్లతో అరణ్యము లాగా ఉండేదని అధ్యయనంలో తేలింది. గ్రామానికి ఉత్తరం దిక్కులో చింత చెట్ల మధ్య ఒక గరుడ పక్షి తిరుగుతుండేది. గరుడ పక్షి ప్రతిరోజు ఆ ప్రదేశములో తిరగడం గమనించిన ఒక వేటగాడు ఒక రోజు ఆ పక్షిపై బాణము వేశాడు. దీంతో ఆ పక్షి క్రింద పడిపోయి బాధతో కొట్టుకుని విలవిలాడుతోంది. వేటగాడు పక్షిని చేతిలోకి తీసుకొని దాని శరీరానికి గుచ్చుకున్న బాణాన్ని తీసి వేశాడు. వెంటనే పక్షి శరీరానికి అయిన గాయము పూర్తిగా మాని రక్తపు మరక మాయమయ్యాయి. ఆశ్చర్యపోయిన వేటగాడు పక్షిని ఊళ్ళోకి తీసుకు వెళ్ళి తన చేతిలో జరిగిన వృత్తాంతాన్ని గ్రామ పెద్దలకు వివరించాడు. అది గరుడ పక్షి గుర్తించిన గ్రామ పెద్దలందరూ ఆ సంఘటన జరిగిన స్థలము వద్దకు వెళ్ళి పరిశీలించారు. పక్షి పడిపోయిన ప్రదేశంలో రక్తపు మరకలు వారికి కన్పించ లేదు. చుట్టు ప్రక్కల చూస్తుండగా వేటగాడు పక్షి పడిన స్థలాన్ని చూపిస్తుండగా వేటగాని చేతిలోని గరుడ పక్షి అదృశ్యమైంది. అప్పుడు పెద్దలందరూ విష్ణు మహిమగా భావించి పూజలు చేశారు. పూజలు చేసిన రోజు రాత్రి ఒక బట్రాజు కులము లోని ఒక వ్యక్తికి స్వప్నంలో సీతారామచంద్ర స్వామి కన్పించి తన వాహనము గరుడపక్షి పడిన ప్రదేశములో ఆలయం నిర్మిస్తే గ్రామస్తులకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయని చెప్పాడని అంటారు. బట్రాజు మర్నాడు గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి తన స్వప్న విషయాన్ని గ్రామ పెద్దలకు వివరించాడు. గ్రామ పెద్దలందరూ కలసి దేవాలయమును నిర్మించారు. అప్పటి నుండి గ్రామాన్ని నరుడు వేటాడిన నాడు అని పిలువ సాగారు. నరుడు వేటాడిన నాడు క్రమంగా నరవేట రానురానూ నరమెట కాలక్రమేణా నర్మెటగా నామాంతరం చెందింది. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షం అయ్యాడని “దేవుని నర్మెట"గా పిలిచారు. ఈ గ్రామంలో సీతారామచంద్ర స్వామి కోర్కెలు తీర్చే కోదండ రామ స్వామిగా ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి వైశాఖ పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీగా మారింది.
కార్యక్రమ వివరాలు :
ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు విశ్వక్సేనారాధన, పూణ్యా:వచనం, రక్షా బంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణం, నివేదన, తీర్ధాగోష్టి కార్యక్రమాలు నిర్వహించారు.
27 వ తేదీన(సోమవారం) ఉదయం ప్రాతఃరాధన, కుంభారాధన, అఖండ దీపారాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, స్వామి వారికి నవకలశ తిరుమంజనం, 11.05 గంటలకు "శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, అనంతరము తీర్థగోష్ఠి, అన్న సంతర్పణ, నిత్య పూర్ణాహుతి, ఆరగింపు, తీర్థ ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 28 వ తేదీ(మంగళవారం) న ప్రాతఃరాధన, సంక్షేప రామాయణ హవనము, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, ఆరగింపు, తీర్థ ప్రసాద వినియోగం, నిత్య హోమము, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, నివేదన, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6.05 గంటల నుండి తెప్పోత్సవం నిర్వహిస్తారు. గద్దలాయ చెరువులో పడవ మీద స్వామి, అమ్మవారు విహరిస్తారు. 29 వ తేదీ,(బుధవారం)నఉదయం ప్రాతఃరాధన, నిత్య హవనం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, ఆరగింపు, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు ఉంటాయి. 30వ తేదీ (గురువారం)న ప్రాతఃరారాధన, బలిహరణం, ఆరగింపు, సుదర్శన హోమము" నిత్యహోమం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 5.00 గంటల నుండి శకటోత్సవము(బండ్లు తిరుగుట) కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 1 తేదీ (శుక్రవారం)న ప్రాతఃరాధన, తెల్లవారు ఝామున 3:00 గంటలకు రథోత్సవం, అనంతరం కుంభారాధన, నిత్య హవనం, మహా పూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, యజమానులకు మహదాశీర్వచనము, చక్ర స్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని ఆలయకమిటి చైర్మన్ రాళ్లబండి రమణచారి కోరారు.