Latest News

కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

02 Feb, 2026 46 Views
Main Image

కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక 

— బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు సుశీలా రెడ్డి

హైదారాబాద్, ఫిబ్రవరి 2(అవనివిలేకరి)తెలంగాణ కోసం తన జీవితాన్నే అర్పించిన నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర  సీనియర్ నాయకురాలు ముక్తవరం సుశీలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ దురహంకార వైఖరికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన సర్వస్వాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. గాంధేయ మార్గంలో, శాంతియుత ఉద్యమంతో 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడిని రాజకీయ కక్షతో కేసుల పేరిట వేధించడం దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు.ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల పేరుతో నోటీసులు జారీ చేస్తూ, విచారణలతో కేసీఆర్‌ను మానసికంగా వేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ జాతిపితగా ప్రజల మనసుల్లో నిలిచిన కేసీఆర్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారిందని మండిపడ్డారు. పాలనలో అసమర్థతను దాచిపెట్టేందుకే కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆమె అన్నారు.రాబోయేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మళ్లీ తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు వచ్చేసరికి కాంగ్రెస్ నాయకులకు తమ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని హితవు పలికారు. సిట్ అధికారులు చట్టాన్ని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కన పెట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు ప్రమాదకర సంకేతమని ఆమె హెచ్చరించారు.కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, అలాంటి నాయకుడిపై జరుగుతున్న దాడులను తెలంగాణ ప్రజలు సహించబోరని ముక్తవరం సుశీలా రెడ్డి స్పష్టం చేశారు.